గడిచిన నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల ప్రజలు తనకంటూ గుర్తింపునిచ్చారని, మీ రుణం తీర్చుకునే బాధ్యత తనపై ఉందని సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాల మంత్రి కేటీఆర్ ఉద్వేగానికి లోనయ్యారు. ఎన్నికల వేళ ఆగం కావొద్దని, కులం, మతం కాకుండా గుణం చూసి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు ఏ పని చేయకపోయినా ఉన్నదిలేనట్లు, లేనిది ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ యువతను దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
అదే సోషల్‌మీడియా వేదికగా యువత వారి అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సిరిసిల్లలోని పద్మనాయక కల్యాణమండపంలో సిరిసిల్ల బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన యువ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై, దిశానిర్దేశం చేశారు. రానున్న 30రోజుల్లో యువత సైనికుల్లా పనిచేయాలని, రాబోయే ఐదేళ్లు మీకు సేవ చేస్తానని చెప్పారు. 2014కు ముందు సిరిసిల్ల ఎట్లుండే, ఇప్పుడు ఎట్లయిందనే అభివృద్ధిని ఫొటోలతో సహా సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని కోరారు.
నాడు ఉరిసిల్లగా మారిన సిరిసిల్లలో వారానికి 8, 9 మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఉన్నాయని కేసీఆర్ నాయకత్వంలో సిరిసిల్లలో నేతన్నల బతుకుచిత్రం మారిందన్నారు. ఇలాంటి అంశాలను ప్రతి ఇంటికీ చేర్చాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. నేను ప్రజలకు పనికి వచ్చే మనిషిని.. సిరిసిల్లకు పని చేసే మనిషిని, ప్రజల దీవెనలతోనే నేను నాయకున్ని అయ్యానని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఇష్టం ఉన్న నాయకులను పక్కాగా గెలిపించుకుంటారన్నారు. ఇంటికి తులం బంగారం ఇచ్చినా.. ఇష్టం లేని నాయకున్ని ఓడిస్తారన్నారు. కలలో కూడా జరుగని అభివృద్ధిని సిరిసిల్లలో చేశామని, జిల్లా కేంద్రం ఏర్పాటుతోపాటు ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దామని వివరించారు. ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఇక్కడేం అభివృద్ధి జరగలేదంటున్నారని, మరి రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు అభివృద్ధి అంతా సిరిసిల్లలోనే జరిగిందంటూ అసూయపడుతున్నారని.. హస్తం నేతలే అవగాహన లేక మాట్లాడుతున్నరని ఎద్దేవా చేశారు. అంతిమంగా తీర్పుఇవ్వాల్సింది సిరిసిల్ల ప్రజలేనని స్పష్టం చేశారు.
తొమ్మిదిన్నరేండ్లలో మీ కండ్ల ముందే జరిగిన అభివృద్ధి ఉందని, తంగళ్లపల్లి వాగులో నాడు తుమ్మలు మొలిచి నీరులేక ఎడారిని తలపించేందని, బతుకమ్మలను నిమజ్జనం చేయడానికి ట్యాంకర్ల ద్వారా నీటితొట్టిలో నీరు నింపి నిమజ్జనం చేసేవారని గుర్తుచేశారు. కానీ, కేసీఆర్ పాలనలో తంగళ్లపల్లి వాగులో 365 రోజులు బ్రహ్మాండంగా ఎన్నటికీ తరగని నీరు కనిపిస్తున్నాయన్నారు. ఎగువమానేరు నుంచి గోదావరిలో కలిసే వరకు వాగు పొడవునా సజీవ జలధార కేసీఆర్ పాలనలో ఆవిష్కృతమైందన్నారు. మానేరును మార్చింది కేసీఆర్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.
సాగునీటి రంగంలో విప్లవం, విద్యలో అభివృద్ధి, ఉపాధి కల్పనలో ముందడుగులు వేస్తూ దూసుకెళున్నామని వివరించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సిరిసిల్ల బైపాస్ రెండో బైపాస్‌లో 450 కోట్లతో వర్క్ టూ ఓనర్ పథకాన్ని 25వేల మందికి ఉపాధి కల్పించేలా ఏర్పాటు చేస్తున్నామ ని తెలిపారు. ఇప్పటికే ఈ పార్క్‌లో రెండు యూనిట్లు ప్రారంభమయ్యాయన్నారు. దేశంలో నే ఎక్కడా లేనివిధంగా 370ఎకరాల్లో మానేరు శివారు ప్రాంతంలో ఆక్వాహబ్ ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. గంభీరావుపేట మండలం నర్మాలలో ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పి స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామన్నారు.
సంక్షేమం, అభివృద్ధి రెండు కండ్లలాగా సిరిసిల్లలో ముందుకుసాగుతూ అద్భుత పురోగతిలో దూసుకెళ్తున్నామన్నారు. నియోజకవర్గానికి పధ్నాలుగున్నర ఏండ్లుగా సేవ చేశానని తెలిపారు. గత నాలుగున్నరేండ్ల నుంచి కులం ఉండదని, మతం ఉండదని, కానీ ఎన్నికలు రాగానే కులం అని ఒకరు, మతం అని ఒకరు బయలుదేరుతారని విమర్శించారు. అదే అభివృద్ధి జరిగినపుడు కులం, మతం ప్రస్తావన ఎందుకు గుర్తుకు రావడంలేదని ప్రశ్నించారు.
ఏ కులంలో పుట్టినప్పటికీ అభ్యర్థుల్లో గుణాన్ని ఆలోచించి ఓటేయాలని సూచించారు. ప్రజా సేవలో నేను పనికి వస్తానని.. నా వల్లే మేలు జరుగుతుందని భావిస్తే నాకు ఓటేయండి. నాకంటే బాగా చేస్తారనే నమ్మకం ఉంటే ఓటుపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. 2009 ఎన్నికల్లో తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ సాధన కోసం కష్టపడతానని చెప్పి, లాఠీ దెబ్బలు తిని జైలుకు వెళ్లానని గుర్తు చేశారు. 2014 ఎన్నికల్లో మళ్లీ గెలిపించిన సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదంతో సీఎం కేసీఆర్ దయతో మంత్రిగా అవకాశం వచ్చిందని, మీ అందరూ తలెత్తుకునేలా పనిచేశానని వివరించారు.
ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా తనది సిరిసిల్ల అని చెప్పుకుంటానని.. నాకంటూ గుర్తింపు తెచ్చింది సిరిసిల్ల నియోజకవర్గం అని మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. నాకు రాజకీయ జన్మనిచ్చింది సిరిసిల్ల అని స్పష్టం చేశారు. ఎన్నికలు రాగానే ప్రతిపక్షాలు ఆగమాగం చేస్తాయని, కులంపేరుతో రాజకీయం చేస్తే కూడు పెట్టదని, మతం పేరుతో మనుగడ ఉండదన్నారు. పధ్నాలుగున్నర ఏండ్ల అభివృద్ధి మీ ఎదుట ఉన్నదని, మీ తలరాత మీరే రాసుకునే అవకాశం మీ చేతుల్లో ఉందన్నారు. 18 నుంచి 25 ఏండ్ల మధ్య యువకులు ఓటుహక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని, మీ ఓటుహక్కు నిర్ణాయక శక్తిగా ఎదుగుతుందన్నారు. రాజకీయాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎలాంటి వారో మీరే ఆలోచన చేయాలని హితవు పలికారు. ఆడబిడ్డల పెళ్లి సంబంధాలకు అటేడు ఇటేడు తరాలు చూస్తామని, మంచిచెడ్డలు పరిశీలిస్తామని.. కష్టపడి సొంత రాష్ట్రంగా ఏర్పాటు చేసుకున్న తెలంగాణను ఎవరి చేతుల్లో పెట్టాలో మీరే నిర్ణయించుకోవాలని కోరారు.
అన్ని రాష్ర్టాలకు సీఎం ఉంటారని, కానీ, మన రాష్ర్టానికి మాత్రం తెలంగాణను తెచ్చిన కేసీఆరే సీఎం ఉన్నారని మంత్రి చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు తెలంగాణపై ప్రేమ ఉండదన్నారు. ఎన్నికల వేళ ఆగంకావద్దని, ఆచితూచి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. సిరిసిల్లలో జరిగిన అభివృద్ధిని రాష్ట్రంలో జరిగిన సంక్షేమ పథకాలను యువత ఫోన్లోని మెసేజ్‌ల ద్వారా బంధువులకు అందరికీ పంపాలని కోరారు. ప్రతిపక్షంలో విజన్ ఉన్న నాయకుడు ఎవరూలేరని, అభివృద్ధే కులంగా సంక్షేమమే మతంగా కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందని వివరించారు.
తెలంగాణను కేసీఆర్ ప్రేమించినంతగా ఏ నాయకుడు ప్రేమించలేడన్నారు. సమ్మేళనంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, ఆయా వార్డుల కౌన్సిలర్లు, వార్డు కమిటీ అధ్యక్షులు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు యువత పాల్గొన్నారు.