Minister KTR interacted with the graduates and members of Telangana Private Colleges and Schools Management
TRS Working President Sri KTR interacted with the graduates and members of Telangana Private Colleges and Schools Management and Staff Welfare Association in Hyderabad.
హైదరాబాద్ – రంగారెడ్డి- మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీమతి ఎస్. వాణిదేవీ గారికి మద్దతుగా ఏర్పాటు చేసిన ప్రయివేటు కాలేజేస్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ వేల్ఫేర్ అసోసియేషన్ సమావేశంలో మంత్రి శ్రీ కేటీఆర్ పాల్గొని పట్టభద్రులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీ కేటీఆర్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదు అని అన్నారు. విభజన చట్టంలోని సంస్థలను కూడా తెలంగాణకు ఇవ్వలేదు. రాష్ర్ట ప్రభుత్వం పన్నుల రూపంలో కేంద్రానికి రూ. 2 లక్షల 72 వేల కోట్లు కడితే.. కేంద్రం మాత్రం రాష్ర్టానికి ఇచ్చింది రూ. లక్షా 40 వేల కోట్లు మాత్రమే అని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణ కంటే ముందు ఏర్పడిన మూడు రాష్ట్రాలు ఇంకా సెటిల్ కాలేదు. తెలంగాణ ఏర్పడిన 6 నెలల్లోనే అనేక సమస్యలు పరిష్కరించాం. మౌలిక అంశాలను పరిష్కరించుకున్నాం. విద్యుత్ సమస్యను అధిగమించాం. తాగు, సాగునీటి కష్టాలకు ఇబ్బందులు లేకుండా చేశామన్నారు.
గడిచిన ఆరున్నర సంవత్సరాలుగా విద్యారంగంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమైన మార్పులు తీసుకువచ్చింది. 2014కు ముందు 248 గురుకుల పాఠశాలలు ఉంటే.. కొత్తగా 647 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. గురుకులాల్లో 4 లక్షల 32 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒక్కో విద్యార్థి మీద లక్షా 20 వేలు ఖర్చు పెడుతున్నామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ.. నీట్, జేఈఈతో పాటు ఇతర ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తున్నారని తెలిపారు.
కేవలం స్కూల్స్ మాత్రమే కాకుండా.. ఆపై తరగతుల విద్యార్థులకు కూడా స్కాలర్షిప్స్ అందిస్తున్నామని చెప్పారు. గత 6 సంవత్సరాల్లో రూ. 12 వేల 800 కోట్లు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందించిందన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అంబేడ్కర్, జ్యోతిబాపులే, వివేకానంద ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరిట విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు.
65 ఏండ్లలో 5 మెడికల్ కాలేజీలు ఉంటే ఈ ఆరేళ్లలో మరో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. సూర్యాపేట, నల్లగొండ, మహబూబ్‌నగర్, సిద్దిపేట, ఆదిలాబాద్‌లో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాం. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. అంగన్వాడీ పిల్లల నుంచి మొదలుకుంటే పీజీ స్థాయి విద్యార్థుల వరకు సన్న బియ్యంతో భోజనం పెడుతున్నామని తెలిపారు. గత ప్రభుత్వాలు దొడ్డు బియ్యంతో భోజనం పెట్టేవారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొలత లేకుండా.. సన్న బియ్యంతో నాణ్యమైన భోజనాన్నికడుపు నిండా పెడుతున్నామని చెప్పారు. పిల్లలు, టీచర్ల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కరోనా లాక్డౌన్ కాలంలో పాఠశాలలను బంద్ పెట్టామని కేటీఆర్ స్పష్టం చేశారు. కరోనా లాక్డౌన్ కాలంలో రాష్ర్ట ప్రభుత్వానికి రూ. 52 వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు.
ప్రయివేటు విద్యా రంగంలో టీచర్లు, నాన్ టీచింగ్ ఉద్యోగులు 12 లక్షల మంది ఉన్నారు. వాళ్లందరికి సంతృప్తికరంగా సాయం అందించడం సాధ్యం కాదు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ప్రయివేటు టీచర్లను ఆదుకోలేదు. ప్రయివేటు టీచర్లకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు.
తెలంగాణ దేశానికే ధాన్య భాండగారంగా మారిందన్నారు. చివరి ఎకరా వరకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా శరవేగంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని తెలిపారు. మహబూబ్‌నగర్‌లో మూడేళ్ల సమయంలోనే లక్షల ఎకరాలకు నీరిచ్చి వలసలు ఆపామన్నారు.
హైదరాబాద్ అత్యంత సురక్షిత నగరంగా ఉందన్నారు. దీంతో అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. పెట్టుబడులు వస్తున్నాయంటే సమర్థవంతమైన నాయకుడు, స్థిరమైన ప్రభుత్వం, శాంతి భద్రతలు పక్కాగా ఉన్నందుకే పెట్టుబడులు వస్తున్నాయన్నారు.
ఇప్పటి వరకు లక్షా 32 వేల ఉద్యోగాలు కల్పించామన్నారు. త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నామని తెలిపారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాలు.. 24,048 ఉద్యోగాలు మాత్రమే. ఇందులో తెలంగాణకు 10 వేల ఉద్యోగాలు మాత్రమే వచ్చాయి. ఏ ప్రభుత్వం కూడా నిరుద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు.
మోదీ ప్రభుత్వం ఏర్పడ్డ సమయంలో సిలిండర్ ధర రూ. 400 ఉంటే.. ఇప్పుడు దాని ధర రూ. 800లకు పెరిగిందన్నారు. మోదీ హయాంలో పెట్రోల్ ధర కూడా సెంచరీ కొట్టేసిందన్నారు. నల్లధనం తీసుకొస్తానని ఊదరగొట్టారు. విదేశాల నుంచి ఇప్పటి వరకు పైసా నల్లధనం తీసుకురాలేదు అని కేటీఆర్ దుయ్యబట్టారు.